Ticker

6/recent/ticker-posts

ఎల్ నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


రైతు రిజిస్ట్రీ నమోదు తప్పనిసరి – ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి

ఏలూరు/పెదపాడు (వట్లూరు), జూన్ 22: వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. సోమవారం వట్లూరు గ్రామంలో రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం, సుస్థిర వ్యవసాయంపై ఆమె చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యవసాయ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా రైతు రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రీ ద్వారా వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ, విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు ఇతర ప్రభుత్వ సేవల్లో ప్రాధాన్యత లభిస్తుందన్నారు.

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్ నినో పరిస్థితుల కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటి సాగు పద్ధతులు పాటించడంతో పాటు వర్షపు నీటి నిల్వ కోసం ఫార్మ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

అధిక నీటి వినియోగం చేసే వరి సాగుకు బదులుగా చిరుధాన్యాలు (మిల్లెట్స్), మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా భూసారం పెరగడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు.

రైతులకు ఎరువుల కొరత లేకుండా డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. APAIMS 2.0 యాప్ ద్వారా రైతుల పంట విస్తీర్ణాన్ని నమోదు చేసి అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను కేటాయిస్తారని చెప్పారు. రైతులు తమ మొబైల్‌కు వచ్చే OTP ఆధారంగా పారదర్శకంగా ఎరువులను కొనుగోలు చేయవచ్చన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, తహసీల్దార్ కృష్ణ జ్యోతి, ఎంపీడీఓ ఆమిల్ జమ్మద్, వ్యవసాయ అధికారి షేక్ ఇమామి ఖాసీం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.