అంగన్‌వాడీ సేవలను ఆధునీకరించే దిశగా కీలక చర్య: జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి
ఏలూరు/పెదపాడు, జూన్ 22: ఏలూరు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను మరింత ఆధునీకరించేందుకు జిల్లా యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. వట్లూరు-1 అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ (విద్యుత్) స్టవ్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల లభ్యతపై ఆధారపడకుండా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని త్వరితగతిన మరియు సురక్షితంగా తయారు చేసి అందించేందుకు ఇండక్షన్ స్టవ్‌లు ఉపయోగపడతాయని తెలిపారు.
పర్యావరణహితమైన, పొగలేని వంటగదుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ స్టవ్‌లను అందిస్తున్నామని చెప్పారు. దీంతో వంట ప్రక్రియ మరింత సులభతరం కావడంతో పాటు సమయాన్ని ఆదా చేయవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి పి. శారద, తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఎంపీడీఓ ఆమిల్ జమ్మద్, వ్యవసాయ అధికారి షేక్ ఇమామి ఖాసీం, సీడీపీవో ఎ. పద్మావతి, సూపర్‌వైజర్లు కె. మేరీబాయమ్మ, కె. కుమారి, అధికారులు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్‌కు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ వల్ల వంట చేయడం సులభమవడంతో పాటు సమయం ఆదా అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

