ANDRAPRADESH, VISAKHAPATNAM, JUN 08: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్టీల్ మెల్టింగ్ షాప్‌లో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై వెంటనే అధికారులతో మాట్లాడిన సీఎం, ప్రస్తుత పరిస్థితులు మరియు సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదే ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ షాప్-2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడిన కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, కుటుంబ పెద్దలను కోల్పోయిన వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని అన్నారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించిన జగన్, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
మరోవైపు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆమె, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. విజయనగరం పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత, ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన విశాఖపట్నానికి బయలుదేరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాద స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
అదేవిధంగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, ఉన్నత స్థాయి సేఫ్టీ కమిటీతో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు అమలు చేయాలని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీవీఎన్ మాధవ్ కోరారు. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు, వివిధ రాజకీయ నాయకులు స్పందిస్తూ బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే ఈ ఘటనలో 9 మంది మృతిచెందినట్టుగా ప్రకటించారు.. మరికొందరు కార్మికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇంకా కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది.. దీంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది..

