Ticker

6/recent/ticker-posts

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్


ANDRAPRADESH, AMARAVATHI, JUN 08: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.


వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని హెచ్చరించింది. ప్రత్యేకించి రైతులు, పశుకాపరులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలని, వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

ఇదిలా ఉండగా, సోమవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరులో 41.7 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 41.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరంలో 41.2 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.