Ticker

6/recent/ticker-posts

శశి విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి: జేఏసీ


తిరుపతి, మే 10: విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తిరుపతిలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో శశి విద్యాసంస్థల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బాధిత దళిత మహిళా ప్రిన్సిపాల్ జే. మంగరాణితో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసి, డైరెక్టర్ కిరణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ శశి విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జే. మంగరాణిని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా తొలగించడం కుల వివక్షకు నిదర్శనమని ఆరోపించారు. ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇప్పటికీ యాజమాన్యం వద్దే ఉంచుకుని వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు.

ఉద్యోగం నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించినందున లేబర్ చట్టాల ప్రకారం పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక మంగరాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.

డైరెక్టర్ కిరణ్‌పై SC/ST Prevention of Atrocities Act కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శశి విద్యాసంస్థల్లో విద్యాహక్కు చట్టం కింద చదువుతున్న విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

అధికారులు తక్షణం స్పందించకపోతే విద్యాసంస్థల ఎదుట నిరసన దీక్షలు చేపడతామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నీరుగట్టు నగేష్, వివిధ విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.