Ticker

6/recent/ticker-posts

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!


ANDRAPRADESH, JUN 08: గోదావరి నదిపై బ్రిటిష్ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఆధునికీకరణ చేపట్టేందుకు సిద్ధమైంది. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ బ్యారేజీకి పూర్తి స్థాయి పునరుద్ధరణ పనులు జరగనున్నాయి. గోదావరి డెల్టా ప్రాంతానికి జీవనాడిగా నిలిచిన ఈ బ్యారేజీ భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.


ధవళేశ్వరం బ్యారేజీలో చివరిసారిగా 1980లో ప్రధాన మార్పులు చేపట్టారు. ఆ తర్వాత కాలక్రమేణా బ్యారేజీలోని పలు భాగాలు దెబ్బతినడంతో పాటు గేట్లపై తుప్పు ప్రభావం కూడా పెరిగింది. డ్యాం భద్రతా నిపుణులు పలుమార్లు బ్యారేజీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నివేదికలు సమర్పించినప్పటికీ.. గతంలో పునరుద్ధరణ పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించగా.. బెకం సంస్థ రూ.124.34 కోట్లకు దక్కించుకుంది. పనులు ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు.

ఆధునికీకరణలో భాగంగా ప్రస్తుతం తుప్పు పట్టి బలహీనంగా మారిన 117 గేట్లను తొలగించి.. వాటి స్థానంలో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త గేట్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో బ్యారేజీ నీటి నిల్వ, విడుదల వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పనులు పూర్తయిన అనంతరం ధవళేశ్వరం బ్యారేజీ భద్రత గణనీయంగా మెరుగుపడటంతో పాటు, గోదావరి డెల్టా ప్రాంతంలోని లక్షలాది ఎకరాలకు సాగునీటి సరఫరా మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని అధికారులు భావిస్తున్నారు. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణతో గోదావరి డెల్టా వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి లభించనుండగా.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నీటి వనరుల నిర్వహణలో కూడా ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.