ఏలూరు/జంగారెడ్డిగూడెం, మే 15: జంగారెడ్డిగూడెం మండలం బయన్నగూడెం గ్రామంలోని సాయి కృష్ణ గోశాల ప్రకృతి వ్యవసాయ శిక్షణ కేంద్రం లో శుక్రవారం మండల నోడల్ బీఆర్సీ పాయింట్ పర్సన్లకు ప్రత్యేక ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింత సమర్థవంతంగా చేరవేయడం, నాణ్యమైన బయో ఇన్‌పుట్స్ తయారీపై అవగాహన కల్పించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కు చెందిన 7 మంది, ఏలూరు జిల్లా కు చెందిన 20 మంది నోడల్ బీఆర్సీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్, అదనపు డీపీఎం మహబూబ్ వలి మాట్లాడుతూ రైతులు రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా కేడర్ సభ్యులు కృషి చేయాలని సూచించారు.
ప్రకృతి సిద్ధంగా తయారుచేసే ద్రావ జివామృతం, జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం, వివిధ రకాల కషాయాలు రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. బయో ఇన్‌పుట్స్ తయారీలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. రసాయనాల అధిక వినియోగం వల్ల ఆహారంలో కల్తీ పెరుగుతోందని, ప్రకృతి సిద్ధ ద్రావణాలు మరియు కషాయాలు మెరుగైన ఫలితాలను ఇస్తాయని వివరించారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన, కల్తీ రహిత ఆహారాన్ని ప్రజలకు అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు. అలాగే PMDS కిట్లు, నవధాన్యాల ప్రాముఖ్యతను ప్రతి రైతుకు వివరించి, ప్రతి పొలంలో PMDS విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా భూమి సారాన్ని పెంచడమే కాకుండా ఎల్‌నినో ప్రభావాన్ని కూడా అధిగమించవచ్చని తెలిపారు.
జిల్లాలోని మండల నోడల్ బీఆర్సీలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన కషాయాలు, ద్రావణాలు నిరంతరం అందించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రైతులు, ప్రకృతి వ్యవసాయ కేడర్ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

