Ticker

6/recent/ticker-posts

అటవీ సంరక్షణకు ఊతం.. ఏలూరు అటవీ శాఖకు 3 కొత్త వాహనాలు


ఏలూరు, మే 15: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ లో రీజెనరేషన్ స్కీమ్ కింద ఏలూరు అటవీ విభాగానికి మూడు కొత్త వాహనాలు మంజూరైనట్లు జిల్లా అటవీ శాఖాధికారి పి.వి. సందీప్ రెడ్డి తెలిపారు. ఈ వాహనాలను ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్), ఆంధ్రప్రదేశ్, మంగళగిరి మరియు ముఖ్య అటవీ సంరక్షణాధికారి, రాజమహేంద్రవరం కార్యాలయాల్లో జెండా ఊపి ప్రారంభించినట్లు చెప్పారు.


ఏలూరు అటవీ శాఖ పరిధిలోని కుకునూరు రేంజ్, అమరావరం రేంజ్ మరియు టాస్క్ ఫోర్స్, ఏలూరుకు ఈ వాహనాలను కేటాయించినట్లు వెల్లడించారు. అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు సమర్థవంతమైన పట్రోలింగ్ నిర్వహణకు ఈ వాహనాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఫీల్డ్ స్థాయిలో పనిచేసే సిబ్బందికి ఇవి మరింత సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, వారి పనితీరును మెరుగుపరచి ఉత్సాహాన్ని పెంచుతాయని సందీప్ రెడ్డి తెలిపారు. గత ఏడాది కాలంలో CAMPA పథకం కింద సుమారు 10 వాహనాలు వివిధ రేంజ్‌లు మరియు విభాగాలకు అందించామని, వాటి ద్వారా అటవీ సంరక్షణ, వన్యప్రాణి పరిరక్షణ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

ఇప్పుడు కొత్తగా కేటాయించిన మూడు వాహనాలతో కలిపి మొత్తం 13 వాహనాలు ఏలూరు డివిజన్‌కు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఈ వాహనాల సమకూర్పు ద్వారా అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని అటవీ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, అలాగే ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి మరియు రాజమహేంద్రవరం ముఖ్య అటవీ సంరక్షణాధికారులకు ఏలూరు అటవీ శాఖ తరఫున సందీప్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.