ఏలూరు, జూలై 22: వాతావరణ ఆధారిత పంటల భీమా పథకంపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి రైతు పథకంలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల భీమా పథకం అమలుపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అకాల వర్షాలు, అధిక వర్షపాతం, చీడపీడలకు అనుకూల వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు, గాలివేగం, గాలిలో తేమ వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే పంట నష్టాల నుంచి రైతులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. జిల్లాలో పత్తి, నిమ్మ పంటలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. పత్తి పంటకు ఎకరానికి రూ.1,900, నిమ్మ పంటకు రూ.2,500 ప్రీమియం జూలై 31లోగా చెల్లించాలని సూచించారు. పంట నష్టం సంభవించినప్పుడు పత్తికి ఎకరానికి రూ.38 వేల, నిమ్మకు రూ.50 వేల వరకు పరిహారం అందుతుందని వివరించారు.
వ్యవసాయ భూమి కలిగిన రైతులతో పాటు కౌలుదారులు కూడా ఈ పథకానికి అర్హులేనని కలెక్టర్ తెలిపారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, భూమి పాస్‌బుక్ ప్రతులు, పంట సాగు ధృవీకరణ పత్రం లేదా స్వీయ ధృవీకరణతో పాటు ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా వివరాలతో సమీప కామన్ సర్వీస్ సెంటర్, పంటల భీమా పోర్టల్, మొబైల్ యాప్ లేదా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ప్రతినిధి ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులు ఆటోమేటిక్‌గా భీమాలో నమోదు అవుతారని, రుణాలు పొందని రైతులందరినీ కూడా భీమా పరిధిలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ప్రస్తుతం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 577 మంది రైతులు నమోదు కాగా, వాతావరణ ఆధారిత పంటల భీమాలో కేవలం 29 మంది మాత్రమే నమోదు కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని వెంటనే మార్చి, అర్హులైన ప్రతి రైతు భీమా పథకంలో నమోదు అయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, జిల్లా ఉద్యానవన అధికారి కె. సాజా నాయక్, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

