Ticker

6/recent/ticker-posts

22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శం: మంత్రి నాదెండ్ల మనోహర్


ఏలూరు, మే 15: 22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక గోదావరి సమావేశ మందిరం లో శుక్రవారం నిర్వహించిన 22ఏ మెగా పరిష్కార మేళాలో మంత్రి స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.


ఈ సందర్భంగా మొత్తం 290 దరఖాస్తులకు సంబంధించి 74 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుండి తొలగించి, సంబంధిత రైతులకు వెంటనే ఉత్తర్వులు అందజేశారు. మరో 202 అర్జీలను 15 రోజులలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గత డిసెంబర్‌లో రాష్ట్రంలోనే తొలిసారిగా ఏలూరు జిల్లాలో 22ఏ మెగా పరిష్కార మేళా నిర్వహించి వందలాది ఎకరాలను జాబితా నుండి తొలగించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించి, రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.

కొన్ని దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన దరఖాస్తులు కూడా అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలో మరో సమావేశం నిర్వహించి మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వంలో సరైన డేటా లేకుండా, రాజకీయ కక్షలతో కొన్ని భూములను 22ఏ జాబితాలో చేర్చారని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం ప్రజలకు ఉపశమనం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. చాలా కాలంగా సమస్యలతో తిరుగుతున్న వృద్ధులు తమ భూములకు విముక్తి లభించడంతో ఆనందం వ్యక్తం చేయడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, గత డిసెంబర్‌లో నిర్వహించిన మొదటి మేళాలో 1199 దరఖాస్తుల్లో 1147 సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడతగా నిర్వహించిన ఈ మేళాకు కూడా ప్రజల నుండి మంచి స్పందన లభించిందన్నారు.

అనంతరం లబ్ధిదారులకు 22ఏ జాబితా నుండి భూములు తొలగించిన ఉత్తర్వులను మంత్రి అందజేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తదితరులు పాల్గొన్నారు.