Ticker

6/recent/ticker-posts

“పేరు దళితులది.. దందా సిండికేట్లది”.. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు


TELANGANA, MAY, 12: తెలంగాణలో లిక్కర్ షాప్‌ల కేటాయింపులలో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోంది. ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాల్లో బినామీ వ్యవహారాలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. ఇటీవల చందానగర్‌లో ఒక వైన్ షాప్‌ను బినామీ ప్రొహిబిషన్ చట్టం కింద ఐటీ అధికారులు సీజ్ చేశారు. తాజాగా ఇదే తరహాలో మల్కాజిగిరి, సరూర్‌నగర్, యాదాద్రి ప్రాంతాల్లోనూ అనుమానాస్పద లావాదేవీలు బయటపడింది. 


పేరుకు మాత్రమే ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు షాప్ యజమానులుగా ఉండగా, అసలు కార్యకలాపాలు మాత్రం థర్డ్ పార్టీ సిండికేట్ సభ్యులే నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. లైసెన్స్ పొందిన పలువురు వ్యక్తులు ఆదాయపు పన్ను సైతం దాఖలు చేయలేని స్థితిలో ఉండగా, లక్షల రూపాయల లైసెన్స్ ఫీజులు ఎలా చెల్లించారన్న దానిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరిలో రిజర్వ్ చేసిన 20 లిక్కర్ షాప్‌లలో 10 షాప్‌లు బినామీల ద్వారా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

అలాగే మేడ్చల్లో 17 రిజర్వ్ లైసెన్స్ షాప్‌లలో 14 షాప్ యజమానుల ఆదాయం రూ.10 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక యాదాద్రి జిల్లాలో 29 షాప్‌లలో 21 షాప్‌ల కార్యకలాపాలను ఎస్సీలకు బదులుగా థర్డ్ పార్టీ వ్యక్తులే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.