ఏలూరు, ఏప్రిల్ 25: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది. ఈ నెలాఖరులోగా రుణ బకాయిలను చెల్లించిన వారికి వడ్డీ మాఫీ వర్తింపజేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
2015-16 నుంచి 2018-19 వరకు NSFDC, NSKFDC పథకాల కింద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రుణాలు పొందిన వారు ఈనెల 30వ తేదీలోగా అసలు బకాయిలను చెల్లిస్తే వడ్డీ పూర్తిగా మాఫీ చేయబడుతుందని పేర్కొన్నారు. ఇది లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయమని చెప్పారు.
బకాయిదారులు ఆలస్యం చేయకుండా వెంటనే రుణాలను చెల్లించాలని ముక్కంటి సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే హామీదారుల జీత భత్యాల నుండి లేదా చట్టపరమైన చర్యల ద్వారా బకాయిలను వసూలు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ వడ్డీ మాఫీ సదుపాయాన్ని ఉపయోగించుకుని రుణభారం నుంచి బయటపడాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు.

