Ticker

6/recent/ticker-posts

సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన – రైతులకు శాస్త్రవేత్తల మార్గదర్శనం


ఏలూరు, ఏప్రిల్ 25: భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మరియు భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (పెదవేగి, ఏలూరు జిల్లా) ఆధ్వర్యంలో శాస్త్రీయ ఆధారిత పోషక నిర్వహణ (సమతుల్య ఎరువుల వినియోగం)పై జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

జిల్లాలోని మక్కినవారిగూడెం క్లస్టర్‌లోని కృష్ణాపురం గ్రామం, చల్ల చింతలపూడి క్లస్టర్‌లోని మేదినారావుపాలెం, రామారావుగూడెం గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. సమతుల్య ఎరువుల వినియోగం, ఫెర్టిగేషన్ విధానాలు, తోటల్లో లభించే వ్యర్థాల పునర్వినియోగం, పచ్చి రొట్ట ఎరువుల వినియోగం వంటి అంశాలపై రైతులకు ప్రాక్టికల్ అవగాహన అందించారు.

శాస్త్రవేత్తల బృందాలు సమగ్ర పోషక నిర్వహణ, ప్రిసిషన్ ఫార్మింగ్, డ్రిప్ నీటి పారుదల, మల్చింగ్ పద్ధతులపై ప్రదర్శనలు నిర్వహించాయి. అలాగే తెల్లదోమ నియంత్రణకు R55 బయోకంట్రోల్ ఏజెంట్ వినియోగం, డికాంటర్ కేక్, POME స్లజ్ వంటి సేంద్రీయ పదార్థాల ఉపయోగంపై రైతులకు వివరించారు. మట్టి నమూనా సేకరణ విధానాలు, గనోడెర్మా వ్యాధి నియంత్రణకు బయో ఎరువుల వినియోగంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.

అదనంగా, ఫాస్పరస్ ఎరువుల వినియోగం తగ్గించడం, బేసల్ స్టెమ్ రాట్, గెల, పండ్ల కుళ్ళు వంటి తెగుళ్ల నివారణ, రైనోసెరస్ బీటిల్ నియంత్రణపై శాస్త్రవేత్తలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలు తక్కువ ఖర్చుతో కూడిన సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించాయి.

మొత్తం 136 మంది రైతులు చురుకుగా పాల్గొని శాస్త్రవేత్తలతో పరస్పర చర్చలు జరిపారు. శాస్త్రీయ విధానాల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆయిల్ పామ్ పంటలో ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.