Ticker

6/recent/ticker-posts

నవధాన్యాల సాగుతో నేల సారవృద్ధి – రైతులకు లాభాలు


ఏలూరు, ఏప్రిల్ 25: ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల విత్తనాల వినియోగం రైతులకు అనేక విధాల లాభాలను అందిస్తుందని జిల్లా ప్రకృతి వ్యవసాయం విభాగం ప్రాజెక్ట్ మేనేజర్ బి. వెంకటేష్ తెలిపారు. ఏలూరు మండలం వెంకటాపురం గ్రామంలోని వెంకటలక్ష్మి ప్రకృతి వనరుల బయో రిసోర్స్ సెంటర్‌లో శనివారం PMDS (నవధాన్యాలు) సీడ్ కిట్ల తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభించింది.


ఈ సందర్భంగా తొలివిడతగా సుమారు 800 PMDS సీడ్ కిట్లు సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచారు. ప్రతి కిట్‌లో 22 నుంచి 25 రకాల విత్తనాలు ఉండగా, సుమారు 15 కిలోల బరువుతో ఒక్కో కిట్ ధరను రూ.1300గా నిర్ణయించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఈ కిట్లు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు.

వెంకటేష్ మాట్లాడుతూ నవధాన్యాల సాగు ద్వారా నేల ఎర్రదనాన్ని తగ్గించి, భూమి సంవత్సరం పొడవునా పచ్చదనంతో కప్పబడి ఉంటుందని చెప్పారు. దీంతో కలుపు మొక్కల పెరుగుదల తగ్గి, నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి భూసారం మెరుగుపడుతుందని వివరించారు. భూమి గుబ్బలా మారి నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు ఎండల సమయంలో పంటలకు తట్టుకునే శక్తి పెరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా, ఈ పంటలు పురుగులు, తెగుళ్ల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని, నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు, వానపాముల సంఖ్య పెరిగి జీవవైవిధ్యం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వేర్ల వ్యవస్థ బలపడటం వల్ల పంటలు వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

ఇంకా నవధాన్యాల పంటలు పశువులకు పోషకాహారంగా ఉపయోగపడటంతో పాలు ఉత్పత్తి, నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం తగ్గి ప్రకృతి వ్యవసాయం మరింత బలోపేతం అవుతుందని వెంకటేష్ వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రకృతి సాగులో ముందడుగు వేయాలని సూచించారు.