ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా నాయకులతో మాట్లాడుతున్నారు. జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలు, నాయకుల పనితీరు, వారిపై ఉన్న ఫిర్యాదులు అన్నింటిపై చర్చిస్తున్నారు. ఈ మధ్య శ్రీకాకుళం జిల్లా నాయకులతో మాట్లాడారు. బుధవారం విజయనగరం జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆయన తండ్రి జోక్యం అధికార కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటోందనే ఆరోపణలను గుర్తు చేసి జాగ్రత్తపడాలని సూచించారు.
విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులతో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను వారి ముందు పెట్టారు. అందులో భాగంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అరంగేట్రంతోనే ఎమ్మెల్యేగా గెలిచావని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తొలిసారి విజయం సాధించిన వెంటనే మంత్రిగా జాక్‌పాట్ కొట్టావని, మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
అధికార వ్యవహారాల్లో శ్రీవాస్ తండ్రి జోక్యం ఎక్కువైందని ఆయన్ని దూరం పెట్టాలని గతంలోనే సూచించినట్టు చెప్పుకొచ్చారు. అయినా ఇంకా పరిస్థితిలో మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి కంచుకోటలాంటి జిల్లాలో వ్యక్తిగతంగా, పార్టీపరంగా ప్రగతి చూపాలని సూచించారు. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని కొండపల్లికి సీఎం హితవుపలికారు.
చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై మంత్రి శ్రీనివాస్ స్పందించారు. ఆరు నెలలుగా ఏ వ్యవహారంలోనూ తన తండ్రి జోక్యం చేసుకోవడం లేదని బదులిచ్చారు. అయితే తన వద్ద పూర్తి రిపోర్ట్ ఉందని ఏం చేస్తున్నారో తెలుసు అని చెప్పేసరికి శ్రీనివాస్ సైలెంట్ అయిపోయారు.
జిల్లా నేతలతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భిన్నమైన పంథాను అనుసరిస్తున్నారు. ముందుగా ఆ జిల్లాలో చేపడుతున్న పనులు, పెండింగ్‌లో పన్నులు, ప్రభుత్వ పథకాలపై చర్చిస్తున్నారు. అనంతరం ఒక్కో ఎమ్మెల్యేకు, ఎంపీ, మంత్రికి సంబంధించిన ఫైల్స్ బయటకు తీస్తున్నారు. వారి పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా 8 మంది ప్రజాప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. వారిలో కొందరు కూటమి నేతలను కలుపుకొని వెళ్లడం లేదని క్లాస్ తీసుకున్నారు. కొందరికి ప్రజల్లో మంచి పేరు ఉందని దాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు. మరి కొందరపై నెగటివ్ అభిప్రాయం ఉందని మార్చుకోవాలని చెప్పారు. ఇలా ఎమ్మెల్యే ప్రొగ్రెస్ రిపోర్ట్ వారికి తెలియజేసి సమస్యలను అడ్రస్ చేస్తున్నారు.

