Ticker

6/recent/ticker-posts

ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు


మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రేమ జంటల వీడియోలు తీసి తన కోరిక తీర్చాలంట వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభించడంతో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి.. ప్రేమ జంటలు, మహిళల వీడియోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేయడమే కాకుండా, లైంగిక వేధింపులకు కూడా పాల్పడటం చర్చనీయాంశమైంది.


బ్లాక్‌మెయిలింగ్ దందా ఇలా..
మాచర్ల నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలకు కాలేజీ విద్యార్థులు, ప్రేమజంటలు అధికంగా వస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న ఏఎస్సై శ్రీనివాస్, జమ్మలమడకకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ను పురమాయించి వారి ఏకాంత దృశ్యాలను వీడియోలు తీయించేవాడు. అనంతరం ఆ వీడియోలను చూపిస్తూ స్టేషన్‌కు పదండి అని భయపెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేసేవాడు. కేవలం డబ్బుతోనే ఆగకుండా, తన కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధించేవాడని విచారణలో తేలింది.

వైరల్ వీడియోలతో దొరికిపోయిన ఏఎస్సై
వేధింపులకు పాల్పడుతున్న ఏఎస్సై శ్రీనివాస్‌ నిర్వాకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఒక వ్యాపారి తన స్నేహితురాలితో ఉన్న వీడియో తీసి, ఏఎస్సై పలు దఫాలుగా డబ్బు వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ అక్రమ వసూళ్ల దందాలో అదే స్టేషన్‌కు చెందిన ఓ ఎస్సై, కానిస్టేబుల్ పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వస్తుండటంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.