Ticker

6/recent/ticker-posts

హనీట్రాప్‌ కేసులో ఉద్యోగాలు పోగొట్టుకున్న పోలీసులు.. సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు డిస్మిస్


ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 27: అనంతపురం జిల్లాలో సంచలనంగా మారిన హహనీట్రాప్ కేసులో పోలీసులపై వేటు పడింది. రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవలానాయక్‌ను సర్వీస్ నుంచి తొలగించారు. అనంతపురం రూరల్ ఎస్సై రాంబాబుతో పాటుగా కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాంనాయక్‌లను సస్పెండ్ చేశారు. అనంతపురం రూరల్ ఎస్సై శేఖర్‌ను కర్నూలు రేంజ్ డీఐజీకి అటాచ్ చేశారు. 

ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులతో సన్నిహిత సంబంధాలతో పాటుగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఈ హనీట్రాప్ కేసులో తాజాగా మరో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఇప్పటికే ప్రధాన నిందితురాలు చిన్ని అలియాస్‌ రంగమ్మ, రాజేష్ నాయుడు, జయలక్ష్మి, చంద్రకళ, అనంతకుమారి అరెస్టై రిమాండ్‌లో ఉన్నారు.


అనంతపురం హనీట్రాప్‌ గ్యాంగ్‌ ప్రముఖులు, వ్యాపారుల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ ఉచ్చులో పడిన బాధితుల్లో అనంతపురం రూరల్‌తో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలవారు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఈ గ్యాంగ్ కొంతమందిని ట్రాప్ చేసి.. ఇళ్లకు పిలిచి వారి ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు దిగుతోంది. ఆ ఫోటోలు, వీడియోలను బయటపెడతామని.. చంపేస్తామంటూ బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు బలవంతంగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ ఏకంగా రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చాలామంది బాధితులు పరువుపోతుందనే భయంతో బయటకు రావడం లేదని చెబుతున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితురాలు రంగమ్మ హనీట్రాప్‌ గ్యాంగ్‌ను లీడ్ చేస్తున్నట్లు తేలింది. ఈ గ్యాంగ్ చేతిలో 20మందికిపైగా మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.. ఈ బాధ్యతల్ని ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి అశ్విన్ కుమార్‌, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌ చౌదరికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ హనీట్రాప్ గ్యాంగ్‌తో లింక్‌లు ఉన్నాయనే కోణంలో మరికొందర్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ హనీట్రాప్ గ్యాంగ్ కేసులో పోలీసుల తీరుపై కూడా విమర్శలు రావడంతో విచారణ జరిపి తాజాగా చర్యలు తీసుకున్నారు.