ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 27: సుప్రీం కోర్టు మతమార్పిడి తర్వాత అట్రాసిటీ చట్టం కింద కేసులపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో బాపట్ల జిల్లాకు సంబంధించిన ఓ చర్చి, పాస్టర్‌కు సంబంధించిన కేసులో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని తేల్చి చెప్పింది. గత నెల (మార్చి 24 2026) 24న తీర్పు ఇవ్వగా ఈ తీర్పుపై పాస్టర్ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు తగిన విధంగా బాపట్లకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దుకు సంబంధించి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో.. బాపట్ల జిల్లా రెవెన్యూ విభాగం పాస్టర్ ఆనంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు అంశంపై ఈ నెల 16న తొలిసారి విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ విచారణకు పాస్టర్ ఆనంద్ హాజరుకాలేదు.. పిటిషనర్ రామిరెడ్డి మాత్రం హాజరైనట్లు సమాచారం. స్థానిక తహసీల్దార్, బాపట్ల ఆర్డీవోలు విచారణలో పాల్గొన్నారని చెబుతున్నారు. ఈ సర్టిఫికెట్‌కు సంబంధించిన అంశంప మరో రెండుసార్లు విచారణ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎస్సీ హోదా రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే పాస్టర్ చింతాడ ఆనంద్ గత నెలలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
అంతేకాదు ఇటీవల పాస్టర్ ఆనంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ బాపట్ల జిల్లా కలెక్టర్, ఏపీ సీఎస్‌కు లేఖ రాసినట్లు తెలిపింది. పాస్టర్‌కు జారీ చేసిన ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని తక్షణమే రద్దు చేయాలని.. అక్రమంగా ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టి పొందిన నష్టపరిహారాన్ని తిరిగి రాబట్టాలని డిమాండ్ చేశారు. గతంలో పాస్టర్‌కు ఎస్సీ ధృవీకరణ పత్రం జారీ చేసిన తహశీల్దార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఓ ట్వీట్ చేసింది.

