ఏలూరు, ఏప్రిల్ 28: షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు తీసుకుని వాటిని సక్రమంగా చెల్లించిన లబ్ధిదారులకు వడ్డీ రాయితీ కల్పించడంతో పాటు సన్మానం నిర్వహించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. ముక్కంటి తెలిపారు.
స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రుణాలు పూర్తిగా చెల్లించిన లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలు అందజేసి, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ముక్కంటి మాట్లాడుతూ…
2015-16 నుంచి 2018-19 వరకు NSFDC / NSKFDC పథకాల కింద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లబ్ధి పొందిన వారు బకాయి రుణాలను చెల్లిస్తే, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వడ్డీ మాఫీ వర్తిస్తుందని తెలిపారు. ముఖ్యంగా, 2026 ఏప్రిల్ 30లోపు అసలు (ప్రిన్సిపల్) మొత్తాన్ని పూర్తిగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ అందుతుందని స్పష్టం చేశారు.
జిల్లాలో మొత్తం రూ.13.55 కోట్ల బకాయిలు ఉండగా, 2026 జనవరి 1 నుంచి ఏప్రిల్ 28 వరకు రూ.1.59 కోట్ల అసలు సొమ్ము 61 మంది లబ్ధిదారుల నుంచి వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో 12 మంది తమ బకాయిలను చెల్లించడంతో, వారికి ఈ రోజు సన్మానం నిర్వహించినట్లు చెప్పారు.
అర్హులైన రుణగ్రహీతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నిర్ణీత గడువులోగా రుణాలు చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

