Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత సమస్యకు చెక్.. సాధారణ స్థితికి చేరుకున్న సరఫరా


ఏలూరు, ఏప్రిల్ 28: జిల్లా యంత్రాంగం తీసుకున్న పటిష్ట చర్యలతో ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత సమస్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారధి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ తదితర అధికారులు తీసుకున్న చర్యలతో పరిస్థితి సాధారణమైంది.


గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో డీజిల్ కొరతపై వదంతులు వ్యాపించడంతో ప్రజలు అధికంగా కొనుగోళ్లు చేయడంతో తాత్కాలిక సమస్య ఏర్పడింది. ఈ పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, ప్రజలకు సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.

డీజిల్ నిల్వలు లేని బంకులకు వెంటనే ట్యాంకర్లను పంపించడం, నిల్వలు తక్కువగా ఉన్న బంకులను ముందుగానే గుర్తించి సరఫరా పెంచడం వంటి చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఫలితంగా మంగళవారం ఉదయం నుంచి బంకుల వద్ద రద్దీ తగ్గి, క్యూ లైన్లు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ నిల్వలు సాధారణ అవసరాలకు సరిపడా అందుబాటులో ఉన్నాయి. ప్రజలు అపోహలకు గురికాకుండా అవసరానికి తగినంత మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవిన్యూ మరియు పౌర సరఫరాల శాఖ సిబ్బంది గత రెండు రోజులుగా చేసిన కృషి ఫలితంగా ఇంధన సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని అధికారులు తెలిపారు.