ఏలూరు, ఏప్రిల్ 28: సేంద్రియ ఆహార ఉత్పత్తుల తయారీ ఎంత ముఖ్యమో, వాటి ప్యాకింగ్ మరియు బ్రాండింగ్ కూడా అంతే ప్రాముఖ్యత కలిగినవని జిల్లా ఉద్యానవన అధికారి షాజా నాయక్ పేర్కొన్నారు.
వట్లూరులోని టిటిడిసి సమావేశ మందిరంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మరియు డిఆర్డిఏ ఆధ్వర్యంలో “ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్, లేబిలింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ పై ప్రాయోగిక శిక్షణ (Hands-on Training)” కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా షాజా నాయక్ మాట్లాడుతూ… సహజ మరియు సేంద్రియ ఉత్పత్తుల నాణ్యతతో పాటు, సరైన ప్యాకింగ్, బ్రాండింగ్ ఉంటేనే మార్కెటింగ్‌లో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాషా మాట్లాడుతూ… సేంద్రియ ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకింగ్, సరైన బ్రాండింగ్ ఉంటే వినియోగదారుల ఆకర్షణ పెరుగుతుందని, మార్కెట్ విస్తరణకు దోహదపడుతుందని చెప్పారు.
ప్రోగ్రామ్ డైరెక్టర్ కె. సుభాష్ కిరణ్ మాట్లాడుతూ… ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్యాకింగ్ పద్ధతులు, మార్కెటింగ్‌లో వినియోగదారులను ఆకట్టుకునే విధానాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. చిన్న తరహా ఆహార పరిశ్రమలకు సుస్థిరమైన బ్రాండ్ల అభివృద్ధి కోసం ఈ శిక్షణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జోనల్ మేనేజర్ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ… పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు PMFME పథకం ద్వారా సబ్సిడీలు, వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ పథకాలు, ఆహార భద్రత ప్రమాణాలు, లైసెన్సింగ్ విధానాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఐపీ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎస్. రామమోహన్, డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి, మెప్మా పీడీ ఎన్. రాజాబాబు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఏపీ సీఎన్‌ఎఫ్ రైతులు, ఎఫ్‌పీఓ సభ్యులు, సూక్ష్మ ఆహార పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

