Ticker

6/recent/ticker-posts

కేసీఆర్–విజయన్–మోదీపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు


TELANGANA: కాంగ్రెస్ పార్టీ తరఫున తిరువనంతపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్‌షో అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కేసీఆర్, పినరయి విజయన్, నరేంద్ర మోదీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


“నేను కొట్టినట్టు నటిస్తా.. నువ్వు తన్నులు తిన్నట్టు నటించు అన్నట్టుగా ఈ ముగ్గురు వ్యవహరిస్తున్నారు. వీరు మంచి మిత్రులు కాదు, మోసకారి మిత్రులు” అంటూ విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించారని, అదే విధంగా కేరళ ప్రజలు కూడా విజయన్‌ను తప్పించాలని పిలుపునిచ్చారు.

ఒకరు రాష్ట్రాన్ని దోచుకున్నారని, మరొకరు దేశాన్ని దోచుకుని వ్యాపార మిత్రులకు లాభం చేకూరుస్తున్నారని, ఇంకొకరు కేరళను దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు ఓటేయాలని ప్రజలను కోరారు.

విజయన్‌పై వివిధ కేసులు ఉన్నాయని, అవి దాచిపెట్టబడుతున్నాయని ఆరోపించిన రేవంత్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని అంశాలను వెలుగులోకి తీసుకొస్తామని అన్నారు. కేరళ ప్రజలు విజ్ఞానవంతులని ప్రశంసిస్తూ, ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

ఈ నెల 23న కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 140 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి పోటీ చేస్తోంది.