ఆంధ్రప్రదేశ్, అమరావతి: ఏపీ మద్యం స్కాం కేసులో ఏ1 నిందితుడు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశించింది.
పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాలని, దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అదేవిధంగా పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించింది.
దాదాపు ఏడాది కాలంగా జైలులో ఉన్న రాజ్ కేసిరెడ్డి, రూ.3,500 కోట్ల విలువైన లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను అరెస్టు చేసింది. అప్పటి నుంచి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
బెయిల్ కోసం జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రయత్నించినప్పటికీ ఇప్పటివరకు ఉపశమనం లభించలేదు. తాజాగా హైకోర్టు అనుమతితో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.
ఈ కేసులో సుమారు 40 మందికి పైగా నిందితులుగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు చెందిన నేతలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, మద్యం వ్యాపారులు, కొన్ని కంపెనీలు కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నాయి.
సిట్ ఆరోపణల ప్రకారం, మద్యం సరఫరా కంపెనీల నుంచి నెలకు రూ.50–60 కోట్ల వరకు కమీషన్లు వసూలు చేసి, ఐదేళ్లలో సుమారు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొంది. ఈ కేసులో ఈడీ, ఏపీ సీఐడీ కూడా విచారణ కొనసాగిస్తున్నాయి.
కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకోవడం, తుది చార్జిషీట్ త్వరలో దాఖలు చేస్తామని సిట్ కోర్టుకు తెలిపిన నేపథ్యంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.

