Ticker

6/recent/ticker-posts

అసెంబ్లీకి జగన్ హాజరు పై చర్చ.. రానా? రారా? అనుమానాలు


ఆంధ్రప్రదేశ్, అమరావతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత రెండేళ్లుగా అసెంబ్లీకి హాజరైన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆయన కేవలం మూడు సార్లు మాత్రమే సభకు వచ్చారని, అందులో ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కోసం, మరో రెండు సార్లు బడ్జెట్ సెషన్ ప్రారంభానికి మాత్రమే హాజరయ్యారని అంటున్నారు.


ఇంకా మిగిలిన బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో 2027లో ఒకసారి హాజరయ్యే అవకాశం ఉందని, అదే సమయంలో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడతారని ప్రచారం జరుగుతోంది. దాంతో 2028 బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఐదేళ్ల కాలంలో కనీసం ఐదు సార్లు అయినా సభకు వస్తారా అన్నది సందేహంగా మారింది.

ఇదిలా ఉంటే రఘురామ కృష్ణంరాజు ఒక ఇంటర్వ్యూలో జగన్ అసెంబ్లీకి రారని తన అంచనాను వెల్లడించారు. సభకు రాకపోతే చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు తనకు ఎవరిపైనా పగ లేదని, అయితే కోపం మాత్రం ఉంటుందని వ్యాఖ్యానించారు. గతంలో తనపై జరిగిన సంఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు.

ఇక సభకు గైర్హాజరు అయ్యే ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు పార్లమెంట్ నిబంధనలపై స్పష్టత కోసం ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. పార్లమెంట్‌లో ఒక విధానం రూపొందితే రాష్ట్రాలు కూడా దాన్ని అనుసరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఏడాదికి ఒకసారి బడ్జెట్ సెషన్‌కు హాజరై నిబంధనలు పాటిస్తే సరిపోతుందనే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల వాతావరణం దగ్గరపడే సమయానికి చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు.

మొత్తానికి ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, జగన్ మరోవైపు ఉండే హాట్ డిబేట్స్ చూడాలనుకున్న వారికి నిరాశ కలిగే పరిస్థితి కనిపిస్తోంది.