విజయనగరం: జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం విమానాశ్రయం) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. భోగాపురం విమానాశ్రయంలో ఈ ఏడాది జనవరి నెలలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక అప్పటి నుంచి భోగాపురం విమానాశ్రయం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అనే ఆసక్తి మొదలైంది. వాస్తవానికి జూన్ నెలలోనే భోగాపురం విమానాశ్రయం ప్రారంభించాలని భావించినప్పటికీ.. కాస్త ఆలస్యమైంది. తాజాగా భోగాపురం ఎయిర్‍పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఎయిర్‌పోర్టును ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికినట్లు తెలిసింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏపీ ప్రభుత్వం నాలుగు తేదీలు నిర్ణయించినట్లు సమాచారం. జులై 5 లేదా 8వ తేదీ, అలాగే ఆగస్టు 17 లేదా 19వ తేదీల్లో ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవం కోసం ఆయా తేదీలలో వీలైన సమయం ఇవ్వాలని ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. మరోవైపు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు జీఎంఆర్ సంస్థ చేపడుతున్న సంగతి తెలిసిందే. నిర్మాణ పనులను జూన్ 30లోపు పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థను ఏపీ ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. పనులు పూర్తైన వెంటనే ఆ నాలుగు తేదీలలో ప్రధాని మోదీకి వీలైన రోజు చూసుకుని ప్రారంభోత్సవం చేయనున్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్టును దేశంలోనే రెండో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా నిర్మిస్తున్నారు. రూ.4,727 కోట్లతో భోగాపురం విమానాశ్రయం తొలి దశ పనులు జీఎంఆర్ సంస్థ చేపడుతోంది. ఇప్పటిదాకా 3,800 మీటర్ల మేరకు రన్ వే నిర్మాణం పూర్తి అయింది. 40 చెక్ ఇన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఎయిర్ పోర్టును నిర్మిస్తున్నారు. 275 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినా,. 27 సెంటీమీటర్ల వర్షం కురిసినాఇబ్బందులు లేకుండా విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. అలాగే విశాఖను భోగాపురం విమానాశ్రయాన్ని కలుపుతూ రహదారుల నిర్మాణం జరుగుతోంది.

