శ్రీశైలం: పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీశైలంలో నాటుసారా, మద్యం విక్రయాలు కలకలం రేపుతున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రం పవిత్రతను కాలరాస్తూ కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా మద్యం, నాటుసారా విక్రయాలు సాగిస్తున్నారు. కొంతమంది మహిళలు ముఠాగా ఏర్పడి ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. మద్యం దందా గుట్టును రట్టు చేశారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నుంచి మద్యం. నాటుసారాను బస్సులలో తీసుకొచ్చి శ్రీశైలంలో అమ్ముతున్న ఐదుగురు మహిళలను పోలీసులు మంగళవారం(ఏప్రిల్ 14) అరెస్ట్ చేశారు. వీరి నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కొంతమంది మహిళలు శ్రీశైలానికి అక్రమంగా మద్యాన్ని తరలించి.. అక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆర్టీసీ బస్టాండ్, సిద్ధ రామప్ప కాంప్లెక్స్, మాణిక్యమ్మపెల్ల ప్రాంతంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి 314 క్వార్టర్ల మద్యం బాటిళ్లను, 24 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. భక్తుల రద్దీని అవకాశంగా చేసుకుని అనుమానం రాకుండా అక్రమంగా మద్యం తరలింపు, విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు శ్రీశైలం లోని హోటల్స్‌లో పని చేసే సిబ్బందిని టార్గెట్‌గా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఓ ప్రముఖ హోటల్ సిబ్బందికి క్రమం తప్పకుండా మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే శ్రీశైలంలోని పలు పాయింట్ల దగ్గర ఈ మహిళలు అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారనే దానిపైనా విచారణ జరుపుతున్నారు. మరోవైపు పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం విక్రయాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని.. ఈ దందా వెనుక ఉన్న వారిని గుర్తించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఉన్న పవిత్రతను కాపాడాలని అధికారులు, పోలీసులకు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

