ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా: ఈ మధ్య జనసేన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు వివిధ ఘటనల్లో చిక్కుకోవడం రాజకీయంగా ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది.. అయితే, తాజాగా, పశ్చిమగోదావరి జిల్లాలో జనసేనకు చెందిన జడ్పీటీసీపై మహిళ చేసిన ఫిర్యాదు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వీరవాసరం మండలానికి చెందిన జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాశ్ నాయుడుపై భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాధిత మహిళ ఫిర్యాదు మేరకు, జయప్రకాశ్ నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరై, అనంతరం మోసం చేశాడని ఆరోపించింది. తాను వివరణ కోరగా దాడికి కూడా పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆమె కొన్ని ఫొటోలు, వీడియోలను కూడా విడుదల చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై మహిళ భీమవరం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సెక్షన్ 69తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇక, ఈ ఆరోపణలపై స్పందించిన జడ్పీటీసీ గుండా జయప్రకాశ్ నాయుడు, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక కొందరు కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విషయం పూర్తిగా తన వ్యక్తిగతమని, దీనిని పార్టీకి లేదా జనసేన అధినేతకు అన్వయించడం సరికాదని చెప్పారు. అలాగే, ఒక స్థల వివాదం నేపథ్యంలో తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించిన జయప్రకాశ్ నాయుడు, ఈ విషయంపై న్యాయపరంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

