ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని దీపం పథకం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్‌కు (పీఎన్‌జీ) మారినప్పటికీ.. వారికి ఇచ్చే రాయితీ సొమ్మును, వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎన్‌జీలోకి మారిన దీపం పథకం లబ్ధిదారులకు వారి బ్యాంక్ అకౌంట్లలో రాయితీ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ మేరకు సత్వరమే ఉత్తర్వులను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
మరోవైపు వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీకాకుళం - కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై అధికారులను వివరణ కోరారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం - కాకినాడ గ్యాస్ పైప్ లైన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో సమీక్షా సమావేశం నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. శ్రీకాకుళం - కాకినాడ సహజవాయువు పైప్‌లైన్‌కు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తైన విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుతో పాటుగా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయించాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు చంద్రబాబును కోరారు. వీటితో పాటు, ఓబీసీ సబ్ ప్లాన్ రూపొందించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్రం పరిధిలో ఉన్న అంశాలను వారితో సంప్రదించి నెరవేర్చేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.

