ఆంధ్రప్రదేశ్: రాజకీయాలకు సంబంధించి నిత్యం ఏదో ఒక అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుంచి 11 సంఖ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతోంది. నాటి ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారింది. ఇక అప్పటి నుంచి టీడీపీ ప్లస్ కూటమి పార్టీలు వీలు చిక్కినప్పుడల్లా 11ను, వైఎస్ జగన్, వైసీపీకి లింక్ పెట్టి ట్రోలింగ్ చేస్తూనే ఉన్నాయి. వాటికి వైసీపీ నుంచి కౌంటర్లు షరా మామూలుగా మారిపోయింది. అయితే 11 సంఖ్యకు హిందూ ధర్మంలో గొప్ప స్థానం ఉందంటున్నారు బీసీవై అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ . ఇటీవల విలేకర్ల సమావేశం నిర్వహించిన రామచంద్ర యాదవ్.. 11 సంఖ్యకు హిందూ ధర్మంలో ఉన్న విశిష్టతను వివరించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
" నిజంగా చెప్పాలంటే హైందవ ధర్మంలో 11 సంఖ్యకు గొప్ప స్థానం ఉంది. 11 అంటే ఏకాదశ రుద్రులు, ఏకాదశ వ్రతాలు, వైకుంఠ ఏకాదశి ఇలా చాలా మంచి స్థానం ఉంది. అలాంటి సంఖ్యను వ్యక్తికి, పార్టీకి ఆపాదించి ట్రోల్ చేయడమనేది దురదృష్టకరం. వైఎస్ జగన్ గారిని, వైసీపీని లెవెన్ రెడ్డి, లెవెన్ పార్టీ అంటూ ఒకరకంగా జగన్‌కు వారు స్పిర్చువల్ పవర్ ఇస్తున్నారు" అని బోడె రామచంద్ర యాదవ్ అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు అమరావతిలో కనీసం వేయి ఎకరాలను బీసీలకు కేటాయించాలని రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, హైదరాబాద్ రాజధానిగా చేసిన తర్వాత.. హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల భూకేటాయింపులు జరిగాయని రామచంద్రయాదవ్ తెలిపారు. 90 పైసలు, 50 పైసలు చొప్పున భూములు కేటాయించారని.. అయితే కొన్ని వేల ఎకరాల భూకేటాయింపులు జరిగినప్పటికీ.. బీసీల వాటా మాత్రం శూన్యమని విమర్శించారు. దీంతో బీసీ స్టడీ సర్కిల్, బీసీ భవన్‌ల నిర్మాణానికి కూడా భూములు లేవన్నారు.
ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాతే అమరావతిలో కనీసం వేయి ఎకరాలు బీసీలకు కేటాయించాలని బీసీవై పార్టీ తరుఫున రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. అమరావతిలో మిగతా సంస్థలకు ఎలా అయితే భూకేటాయింపులు చేస్తున్నారో.. అదే తరహాలో బీసీలకు కనీసం వేయి ఎకరాలు భూకేటాయింపులు చేయాలని.. ఆ మొత్తాన్ని బీసీవై పార్టీ సేకరించి అందిస్తామన్నారు.

