అమరావతి, ఏప్రిల్ 19: అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే చిన్నారికి రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను మంత్రి నారా లోకేశ్ సమకూర్చిన సంగతి తెలిసిందే. పునర్విక ప్రాణాలు కాపాడేందుకు రూ.16 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో తాను ఉండటం గొప్ప భావోద్వేగ సందర్భమని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అలానే ఈ ఘటనతో ప్రేరణ పొందిన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
అరుదైన వ్యాధులపై సమగ్ర దృష్టితో ‘ప్రాజెక్ట్ పునర్విక’ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. అరుదైన జన్యు వ్యాధులతో బాధపడే పునర్విక లాంటి పిల్లల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్‌కు సాయం చేసేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తామన్నారు. అత్యంత ఖరీదైన చికిత్సల ఖర్చు తగ్గించేలా..అంతర్జాతీయ ఔషధ సంస్థలతో భాగస్వామ్యానికి ప్రణాళికలు వేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యులు, నిపుణులతో కలిసి దీర్ఘకాలిక పరిష్కారాల కోసం అన్వేషించాలని ఆయన కోరారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్విక అనే చిన్నారికి ఇంజెక్షన్ కోసం రూ.16 కోట్లు అవసరం కాగా.. దాతలు స్పందించి రూ.10 కోట్లు మేర సమకూర్చారు. చిన్నారి తల్లిదండ్రులు ‘ఎక్స్’లో చేసిన అభ్యర్థనకు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చడం తన బాధ్యత అని ఆ కుటుంబానికి ఫిబ్రవరిలో లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు విదేశాల నుంచి జోల్ జెన్ స్మా ఇంజెక్షన్‌ను లోకేశ్ తెప్పించగా.. ఆయన సమక్షంలోనే హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో వైద్యులు నిన్న(శనివారం) పునర్వికకు ఇంజెక్షన్ చేశారు.

