అమరావతి, ఏప్రిల్19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం రేపు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్లకు ఆయన సతీమణి భువనేశ్వరి రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు. అందుకు సంబంధించిన చెక్కును ఆదివారం ఉన్నతాధికారులకు ఆమె అందజేశారు. ఈ నగదుతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 296 అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనాన్ని అందించనున్నారు.
అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు అమ్మను తలపిస్తున్నాయన్నారు. ఇది లక్షలాది మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమం అని అభివర్ణించారు. ఈ క్యాంటీన్ల ద్వారా రూ.5 లకే పరిశుభ్రమైన వాతావరణంలో గౌరవంగా పేదలకు భోజనం అందిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రతి ఏటా అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి భారీగా విరాళాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.

