ANDRAPRADESH, POLAVARAM: ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు మేర నిర్మించేందుకు సమ్మతి తెలిపింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తొలిసారిగా స్పష్టమైన ప్రకటన చేసింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు గత నెల 25న ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పీపీఏ వెబ్ సైట్ లో పోలవరం ఎత్తు కేవలం 41.15 మీటర్లుగానే చూపేవారు. 115 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు ఆ వెబ్ సైట్ లో ఉండేది.
అయితే తాజాగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ వెబ్ సైట్ లో ప్రాజెక్టు వివరాల్లో పూర్తిగా మార్పులు చేశారు. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లుగా చూపడమే కాకుండా, గరిష్ట నిల్వ 194.60 టీఎంసీలుగా పేర్కొన్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు రెండో దశ చేపట్టేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 41.15 మీటర్ల ఎత్తు ఉన్న ప్రాజెక్టును 45.72 మీటర్లకు పెంచాలంటే కేంద్రం తరఫున పలు కార్యక్రమాలు చేయాల్సివుంటుందని చెబుతున్నారు. కేంద్ర అటవీ పర్యావరణ అనుమతులు, స్టాప్ వర్క్ ఆర్డర్ ఎత్తివేత వంటి చర్యలు తీసుకోవాల్సివుంటుందని చెబుతున్నారు.
గరిష్ట కాంటూరు 45.72 మీటర్లు ఎత్తు పెంచితే ప్రాజెక్టు రూపురేఖలు మారిపోనున్నాయని అంటున్నారు. ప్రస్తుతం పోలవరం మొదటి దశ పనులు చివరికి చేరుకున్నాయని అంటున్నారు. వచ్చే ఏడాది జూన్ లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ముందుగానే ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో కేంద్రం రెండో దశ పనుల విస్తరణపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. కాగా, 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీల చొప్పున రెండు దఫాలుగా నీటిని నిల్వ చేసుకోవచ్చునని అంటున్నారు. అంటే ప్రాజెక్టు ద్వారా మొత్తం 389.2 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
గరిష్ట కాంటూరు కూడా పూర్తయితే గోదావరి డెల్టాలో మొత్తం 10.13 లక్షల ఎకరాలు, 13 లక్షల కృష్ణా డెల్టాకు పుష్కలంగా సాగునీరు అందుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కృష్ణా బేసిన్ లో 80 టీఎంసీలు నీటిని సరఫరా చేస్తారని, ఇందులో 23.44 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. అదేవిధంగా మొత్తం 28.5 లక్షల మందికి సాగునీటి సమస్య తీరుతుందని, 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెబుతున్నారు.
ఇక పోలవరం ప్రాజెక్టు రెండో దశకు ప్రభుత్వం సిద్ధమైతే భూ సేకరణకు భారీగా వెచ్చించాల్సివుంటుందని అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన కట్టడాల్లో ఎలాంటి మార్పు ఉండదని, కానీ, నిర్వాసితులకు పరిహారం, సహాయ పునరావాసాల కోసం రూ.28,561 కోట్లు అవసరం అవుతాయని లెక్క గడుతున్నారు. రెండో దశకు 80 వేల ఎకరాలు సేకరించాల్సివుంటుందని, మొత్తం 8 రెవెన్యూ మండలాల్లో 222 రెవెన్యూ గ్రామాలు ముంపునకు గురవుతాయని చెబుతున్నారు.

