ఆంధ్రప్రదేశ్: రాష్ట్రం నుండి హజ్ - 2026 కి మొత్తం 2000 మంది యాత్రికులు బయలుదేరనున్నారని, అందులో విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి ఏప్రిల్ 18 మరియు 19 తేదీలలో 352 మంది ప్రయాణికులు బయలుదేరనున్నారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికార యంత్రంగాన్ని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశించారు. గురువారం గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ హాల్ లో హజ్ క్యాంప్ -2026 కు ఏర్పాట్లపై మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ అధ్యక్షతన సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగర నడిబొడ్డున అన్ని సౌకర్యాలతో హజ్ భవన్ నిర్మించడం జరిగిందన్నారు. అప్పట్లో హైదరాబాదులో కూడా ఎంబార్కేషన్ కేంద్రం ఉండేది కాదని, అప్పటి ప్రధాని వాజ్ పేయి దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువెళ్లడంతో ఏంబార్కేషన్ కేంద్రం మంజూరు అయిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రయాణికులకు ఏంబార్కేషన్ కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాలలోని కేంద్రాలకు వెళ్లాల్సి వస్తున్నదన్నారు.
ఈ విషయంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కేంద్రం దృష్టికి సమస్యను తీసుకువెళ్లి విజయవాడకు ఏంబార్కేకేషన్ కేంద్రం మంజూరు చేయించారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి, కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కి మంత్రి ఫరూక్ ధన్యవాదాలు తెలిపారు. పవిత్ర మక్కాయాత్ర హజ్ కు వెళ్లే యాత్రికులందరికీ, అన్ని రకాల మౌలిక సదుపాయాలతో విజయవాడలో హజ్ హౌస్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. విజయవాడ నుంచి హజ్ కి వెళ్లే ప్రయాణికులు అందరికీ రూ. లక్ష ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం అందిస్తున్నదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముస్లిం మైనారిటీల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
రాష్ట్రం నలుమూలల నుండి విజయవాడకు చేరుకునే ప్రయాణికులందరికి ఏర్పాటు చేసే క్యాంప్ లో హజ్ యాత్ర విజయవంతం కోసం అనుసరించాల్సిన నియమ నిబంధనలు, పద్ధతులు, వ్యవహరించాల్సిన తీరును విశదీకరించాలని సూచించారు. విజయవాడ నుండి మదీనాకు ప్రత్యేక విమానాల ఏర్పాటు, యాత్రికుల బోర్డింగ్ వివరాలను హజ్ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. యాత్రికుల లగేజీని వేగంగా తరలించేలా చూడాల్సిన ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
విమానాశ్రయంలోహజ్ యాత్రికుల కోసం ప్రత్యేక కౌంటర్లు, విడిగా అరైవల్/ డిపార్చర్ లాంజ్-లను, నమాజు వసతిని కేటాయించాలని, చెక్-ఇన్ ప్రక్రియ కోసం అదనపు సిబ్బందిని నియమించాలని, ప్రయాణికుల రాకపోకల విషయంలో హజ్ కమిటీతో సమన్వయం చేసుకోవాలన్నారు. హజ్ వీసాలను త్వరితగతిన క్లియర్ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.గ్రూపుల కోసం ముందస్తు క్లియరెన్స్ సౌకర్యం కల్పించాలని పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం 24/7 సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.
యాత్రికుల కోసం భద్రతా ప్రోటోకాల్ ను పెంచాలని, మహిళా యాత్రికుల కోసం ప్రత్యేక మహిళా సిబ్బందితో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. క్యాంప్ లు,లాంజ్-ల వద్ద సిసిటివి నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి ని సంబంధిత అధికార యంత్రాంగం తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా చర్యలు అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. కరెన్సీ మార్పిడి, హజ్ చెల్లింపుల కోసం క్యాంప్ తో పాటు విమానాశ్రయం వద్ద తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. యాత్రికులకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా మార్పిడి సౌకర్యం, డిజిటల్ బ్యాంకింగ్ మద్దతు అందించాలని ఆదేశించారు.

