Ticker

6/recent/ticker-posts

రోడ్డు భద్రతే లక్ష్యం – నేషనల్ హైవేపై ‘స్టాప్ – వాష్ అండ్ గో’ కార్యక్రమం


జీలుగుమిల్లి, మార్చి 1: రహదారి ప్రమాదాలను నివారించేందుకు ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జీలుగుమిల్లి పోలీసులు నేషనల్ హైవేపై ‘స్టాప్ – వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఫిబ్రవరి 28 మరియు మార్చి 1 తేదీలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల మధ్య డ్రైవర్లు నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైవేపై వెళ్తున్న లారీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, కార్లు మరియు ఇతర వాహనాలను ఆపి డ్రైవర్లకు మంచినీళ్లతో ముఖం కడిగించి నిద్రమత్తు పోగొట్టేలా చేశారు. దీంతో డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడిపే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు మరియు డ్రైవింగ్ లైసెన్సులను కూడా పోలీసులు పరిశీలించారు. అతివేగంగా వాహనాలు నడపరాదని, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం ప్రమాదకరమని, పరిమితికి మించి ప్రయాణికులు లేదా సరుకు ఎక్కించరాదని డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

మత్తుపదార్థాలు సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ల చేతుల్లో ఉంటాయని, కొద్దిపాటి అజాగ్రత్త కూడా అనేక కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టవచ్చని పోలీసులు పేర్కొన్నారు.

గమ్యం చేరడంలో తొందరపడటం కంటే సురక్షితంగా ఇంటికి చేరడమే ముఖ్యమని జీలుగుమిల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్ సూచించారు.