ఏలూరు, మార్చి 1: సమస్యలేవైనా సలహాలు, సంప్రదింపుల ద్వారానే పరిష్కార మార్గాలు సుగమం చేయగల సుగుణాలు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, త్వరలోనే వాటికి పరిష్కార చర్యలు చేపట్టనున్నట్లు ఆయన భరోసా కల్పించారు.
ఆదివారం ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ హెల్పర్లు ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఇదే అంశంపై కూటమి ప్రభుత్వాధినేతలు అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంఘాల నాయకులు మరియు ప్రతినిధులతో పలు దశలుగా సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. సామరస్యపూరిత వాతావరణంలో అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం త్వరలోనే అమలు కానుందని చెప్పారు.
అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఆయన హామీ ఇచ్చారు.
అదేవిధంగా, ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను తప్పుగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ నాయకులకు అవకాశమివ్వకుండా ధర్నాలు, ఆందోళనలు చేపట్టవద్దని సుత్తిమెత్తగా సూచించారు.
ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
