Ticker

6/recent/ticker-posts

"నేను ఎవరో మీకు తెలుసా?" – ఏలూరు పోలీసుల వినూత్న ఫ్లెక్సీ వైరల్


ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లాలో పోలీసులు చేపట్టిన వినూత్న ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించేలా "నేను ఎవరో మీకు తెలుసా?" అనే శీర్షికతో పాత నేరస్థుల ఫోటోలతో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. 


సాధారణంగా రాజకీయ నాయకుల శుభాకాంక్షలు లేదా కార్యక్రమాల కోసం మాత్రమే ఫ్లెక్సీలు కనిపిస్తుంటాయి. కానీ ఈసారి ఏలూరు పోలీసులు నేరాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని అవలంబించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పాత నేరస్థుల ఫోటోలు, పేర్లు, వారి నివాస ప్రాంతాల వివరాలను ప్రదర్శించారు.

ఇళ్ల దొంగతనాలు, బైక్ దొంగతనాలు, గొలుసు లాకెట్లు లాగేవారు, ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్లు దొంగిలించే నేరస్థుల ఫోటోలను కూడా ఈ ఫ్లెక్సీలో చేర్చినట్లు తెలిసింది. 

"వీరు మీ కంటపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి" అనే సందేశంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ చర్యతో నేరస్థులు బయట తిరగడానికే భయపడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు.

ఈ ఫ్లెక్సీని చూసిన ప్రజలు "పోలీసుల ఐడియా అదుర్స్", "సినిమా రేంజ్ ప్లాన్" అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

జాగ్రత్త – వీళ్లు మీ చుట్టుపక్కలే ఉండొచ్చు!
ఏలూరు పోలీసుల వినూత్న ప్రచారం నేరాల నియంత్రణలో ఎంతవరకు ఫలితమిస్తుందో చూడాలి.