Ticker

6/recent/ticker-posts

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో AISF, NFIW నాయకులు మమేకం


మురుగు కాలువలను శుభ్రపరిచిన విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు


ఏలూరు: స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF), ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (NFIW) ఏలూరు జిల్లా నాయకులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఏలూరు నగరంలోని సైన్స్ పార్క్ సమీపంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల వసతి గృహం ఎదుట ఇరువైపుల కాలువల్లో నిల్వ ఉన్న మురుగునీరు, చెత్తాచెదారాన్ని శుభ్రపరిచారు.

ఈ సందర్భంగా AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సాయికుమార్, NFIW ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని మాట్లాడుతూ, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఏలూరులోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు వసతి గృహాల్లో ఉంటున్నారని తెలిపారు. వసతి గృహం ఎదుట గత కొన్ని నెలలుగా కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండటం, చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమలు పెరిగి విద్యార్థినులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏలూరు జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు AISF, NFIW నాయకులు స్వచ్ఛందంగా కాలువలను కొంతవరకు శుభ్రపరిచినట్లు తెలిపారు.

విద్యార్థినుల తరఫున మరియు వారి తల్లిదండ్రుల తరఫున సంబంధిత ఉన్నతాధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో డ్రైనేజీ కాలువలను శుభ్రపరచి మురుగునీరు చెరువుల్లోకి వెళ్లేలా శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో AISF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధిక్ బాబు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి. శివకుమార్, నాయకులు సిద్దు, యశ్వంత్, కృష్ణ, మణికంఠ, NFIW నాయకురాలు వి. యామిని తదితరులు పాల్గొన్నారు.