Ticker

6/recent/ticker-posts

ముంజేరు గ్రామంలో దళిత కాలనీ వాసుల దీక్షకు బహుజనసేన మద్దతు


భోగాపురం, మార్చి, 10: విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలోని సిద్ధార్థ కాలనీ దళిత వాసులపై జరుగుతున్న వివక్షపూరిత చర్యలను నిలిపివేయాలని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు చందు డిమాండ్ చేశారు. సిద్ధార్థ కాలనీ వాసులు చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి వారి పోరాటానికి మద్దతు తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 సంవత్సరం నుంచి ముంజేరు గ్రామంలోని సిద్ధార్థ కాలనీకి అగ్రకులాల మురుగునీరు వచ్చేలా దారి మళ్లించడంతో అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని గతంలో ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ స్వయంగా గ్రామానికి వచ్చి నివేదిక సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

అట్రాసిటీ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే హైకోర్టు విచారణను తప్పుదారి పట్టించిన రెవెన్యూ అధికారులపై కూడా అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమస్యపై గత 95 రోజులుగా కాలనీ వాసులు నిరసన దీక్ష కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 15న ఈ దీక్ష 100 రోజులకు చేరనున్న నేపథ్యంలో భోగాపురంలో నిర్వహించే భారీ నిరసన కార్యక్రమానికి బహుజనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ మరియు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.