Ticker

6/recent/ticker-posts

ఎన్నికల హామీలు తక్షణం అమలు చేయాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య


ఏలూరు, మార్చి, 10: ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిర్వహిస్తున్న గడప గడపకు సిపిఐ పార్టీ ఉద్యమ నిధి సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


పవర్‌పేట రైల్వే స్టేషన్ నుంచి ఆర్‌ఆర్‌పేట మెయిన్ రోడ్ వరకు నిర్వహించిన కార్యక్రమంలో గుజ్జుల ఈశ్వరయ్య ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాటి అమలుపై ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పేదలకు సొంత ఇళ్లు వంటి కీలక అంశాలకు కూడా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు.

విద్యార్థులు, యువతకు నాణ్యమైన విద్య మరియు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న మెడికల్ మాఫియాను నియంత్రించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ భూములను కేటాయిస్తూ వారికి అనుకూలంగా రాయితీలు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు.

పేదలకు సొంత ఇళ్లు అందించాలనే డిమాండ్‌తో మార్చి 24న సిపిఐ చేపట్టనున్న ఇల్లు, ఇళ్ల స్థలాల పోరాటాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు విరాళాలు అందించి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గత వందేళ్లుగా పార్టీ చేసిన పోరాటాలను ప్రజలకు తెలియజేస్తూ భవిష్యత్ ఉద్యమాలకు సహాయ నిధి సేకరిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సహాయ కార్యదర్శులు కురెళ్ళ వరప్రసాద్, అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, గొర్లి స్వాతి, కొల్లూరి సుధారాణి, కొండేటి బేబీ, శాయన అభిలాష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, లక్కోజు జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.