Ticker

6/recent/ticker-posts

అధికారం పోయినా రోజాకు మదం తగ్గలేదు...భువనేశ్వరిపై మాట జారితే తాట తీస్తాం: మంత్రి సవిత వార్నింగ్


ఆంధ్రప్రదేశ్: అధికారం పోయినా ఇంకా అదే మదంతో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని అందుకు నిదర్శనమే మాజీమంత్రి రోజా వ్యాఖ్యలు అని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయాక రోజా బుద్ధి మారిందని అనుకున్నాం... కానీ ఇంకా నీచంగా మాట్లాడటమే అజెండాగా పెట్టుకుంది. రోజాకు భువనమ్మ గురించి, నారా వారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉందా?. హిందూవులమని నటించేందుకు మీలా మాకు సినిమా సెట్టింగులు వేసుకునే అవసరం లేదు అని మంత్రి సవిత అన్నారు. సీఎం చంద్రబాబు ఆయన జీవితకాలంలో ఎన్నో దేవాలయాలకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి భువనమ్మతో కలిసి కుటుంబ సమేతంగా ఎన్ని సార్లు వెళ్లారు. ఎన్నో సార్లు ప్రభుత్వం తరఫున కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవన్ని రోజాకు కనిపించవు అని మంత్రి సవిత మండిపడ్డారు.


తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ చదవడమే రోజా పని
‘తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చి స్క్రిప్ట్ చదవడమే రోజా పని. జగన్ తనకు, తన బిడ్డ వైఎస్ షర్మిళకు అన్యాయం చేశాడని బహిరంగంగా లేఖ విడుదల చేసింది. ఆ లేఖను డైవర్ట్ చేసేందుకే రోజాను రంగంలోకి దింపారు’అని మంత్రి సవిత ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ఏ దేవాలయానికైనా కుటుంబ సమేతంగా, సతీ సమేతంగా వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించాడా? రికార్డుల్లో ఉంటే చూపించమని రోజాకు సవాల్ విసురుతున్నా? ఐదేళ్ల పాలనలో హిందూ ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేశారు. రథాలను తగలబెట్టారు. హిందూ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేసి... ఇప్పుడు నీతులు చెబుతుంటే నవ్వోస్తోంది అని మంత్రి సవిత అన్నారు.

హిందువులమని నమ్మించే జగన్ ప్రయత్నాలు
‘మార్చి 21న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వెళ్లి శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. మీకు హిందూ ఆచారాలపై విశ్వాసం ఉంటే, వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటే జగన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి, వైఎస్ భారతితో కలిసి సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకోవాలి. అది మీ జగన్ రెడ్డి చేయగలడా? చేయలేడు’అని మంత్రి సవిత చెప్పుకొచ్చారు.‘కేవలం ఇంట్లో సెట్టింగులు వేసుకొని హిందూవులమని నమ్మించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నట్టు?. అర్చకులు చెప్పినా కూడా ప్రదక్షణలు చేయరు. స్వామివారి శాలువా కప్పుతుంటే దూరంగా ఉంటారు. మీరు మాకు ఆచారాల గురించి, సాంప్రదాయాల గురించి చెబుతుంటే విడ్డూరంగా ఉంది’అని మంత్రి సవిత ఎద్దేవా చేశారు.

సొంత చెల్లెమ్మలకు న్యాయం చేయని అసమర్ధుడు జగన్
‘జగన్ రెడ్డి ముందు విజయమ్మకు, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలకు న్యాయం చేయమని వైసీపీ నేతలు చెప్పాలి. లేదంటే సొంత చెల్లెమ్మలకు న్యాయం చేయలేని అసమర్థుడిగా జగన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారు’అని మంత్రి సవిత చెప్పుకొచ్చారు. ‘వేలాది మంది ఉపాధి కాల్పిస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటూ నీజాయితీగా వ్యాపారం చేస్తున్న భువనేశ్వరిపై పనిగట్టుకొని వైసీపీ విషప్రచారం చేస్తోంది. మీ నీచ రాజకీయాల కోసం భువనేశ్వరిని లాగుతారా? జగన్ తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఎంతకైనా దిగజారుతాడని అందరికీ తెలుసు. రోజా నోరు అదుపులో పెట్టుకొని హుందాగా రాజకీయాలు చేయాలి’అని మంత్రి సవిత హెచ్చరించారు.

మాజీమంత్రి రోజా వ్యాఖ్యలు ఇవే
ఉగాది ప‌ర్వ‌దినం రోజున సీఎం చంద్ర‌బాబు చెప్పిన అబ‌ద్ధాల‌పై వైసీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. ఉగాది పర్వదినం రోజునే రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మాజీమంత్రి రోజా అన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఉగాది రోజున ప్రజలు సంతోషంగా ఉన్నార‌ని చెప్పడం పూర్తిగా అసత్యమని విమర్శించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలు, మ్యానిఫెస్టోలోని 145 వాగ్దానాలు అమలు కాలేదని ఆరోపించారు. 

18 ఏళ్లు దాటిన మహిళలకు నెల‌కు రూ.1500 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, నిరుద్యోగులకు రూ.3000 భృతి వాగ్దానం చేసి మోసం చేశారని ఆమె విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారని మాజీమంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాలనలో పేదలు, ఉద్యోగులు, రైతులు సంతోషంగా ఉన్నారని రోజా గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఉగాది సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయలేదని త‌ప్పుప‌ట్టారు. అర్హతలేని వారికి పదవులు ఇస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి ఆర్‌కే రోజా డిమాండ్ చేశారు.