Ticker

6/recent/ticker-posts

స్వతంత్ర హోదాలో మాపై దురాక్రమణను అడ్డుకోండి..


దిల్లీ: బ్రిక్స్‌ కూటమికి ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న భారత్‌.. ఆ హోదాలో స్వతంత్రపాత్ర పోషించి ఇరాన్‌పై దురాక్రమణల్ని అడ్డుకునే చర్యలు చేపట్టాలని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ కోరారు. ‘‘విదేశీ జోక్యం లేకుండా’’ పశ్చిమాసియా దేశాలు ఒక ప్రాంతీయ భద్రత వ్యవస్థగా ఏర్పడాలని ప్రతిపాదించారు. 

పెజెష్కియాన్‌తో భారత ప్రధాని మోదీ శనివారం ఫోన్లో మాట్లాడారు. అణ్వాయుధాలు సమీకరించుకోకుండా అడ్డుకునేందుకే తమపై సైనిక దాడికి దిగినట్లు అమెరికా చెప్పడాన్ని ఇరాన్‌ అధ్యక్షుడు ఖండించారు. దివంగత సుప్రీంనేత ఖమేనీ ఈ ఆయుధాలను తీవ్రంగా వ్యతిరేకించారని, వాటి అభివృద్ధికి ఎలాంటి ముందడుగు వేయకూడదంటూ పాలనపరమైన, మతపరమైన ఆదేశాలు జారీచేశారని ఆయన చెప్పినట్లు టెహ్రాన్‌లో ఇరాన్‌ విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది.  

పశ్చిమాసియాలో కీలక మౌలిక సదుపాయాలపై దాడుల్ని మోదీ ఖండించారు. నౌకాయాన స్వేచ్ఛను కాపాడాలని, ఆయా మార్గాలు సురక్షితంగా.. తెరచి ఉండేలా చూడాలని నొక్కిచెప్పారు. తొలుత రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపి, ఈ పండుగ సమయం పశ్చిమాసియా ప్రాంతానికి శాంతి-సుస్థిరతను, సుసంపన్నతను తీసుకురావాలని ఆకాంక్షించారు.