ఆంధ్రప్రదేశ్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో నెలకొన్న ఆస్తుల వివాదంపై ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ నుంచి కీలక ప్రకటన వెలువడింది. వైఎస్సార్ మరణానికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని విజయమ్మ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల విషయంలో తన మేనల్లుడు, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ మేరకు విజయమ్మ పేరుతో ఒక అడ్వకేట్ నోటరీ వెలువడింది. ఇందులో విజయమ్మ పలు అంశాలను ప్రస్తావించారు. ఆస్తుల విషయంలో నిజం ఏమిటనేది తన దేవుడికి, తన కొడుకుకి కూడా తెలుసునని అన్నారు. దేవుని సాక్షిగా తాను పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలు అని చెప్పారు. ఇందుకు సంబంధించి తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నానని తెలిపారు.
‘‘2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే ( combined family assets). ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలుకు సమానంగా పంచాలని వైఎస్సార్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమిది. ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంవోయూ రాశారు (నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్‌తో సహా ఎంవోయూలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే).
ఆస్తులు విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్సార్ జగన్‌కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు?, మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే’’ అని విజయమ్మ పేర్కొన్నారు.

