బాపట్ల, మార్చి, 10: బాపట్ల పట్టణ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన వార్డు – మన ఎమ్మెల్యే’ కార్యక్రమం మంగళవారం పునఃప్రారంభమైంది.
తమ వార్డుకు స్వయంగా విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు హారతులతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు బాపట్ల పట్టణంలోని రైలుపేట 4వ వార్డులో ఎమ్మెల్యే గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలతో మమేకమై వారి రోజువారీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల విన్నపాలపై స్పందించిన ఎమ్మెల్యే పర్యటనలో ఉన్న మున్సిపల్ అధికారులను పిలిచి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆశయాల మేరకు ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే చేర్చడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. వారంలో ప్రతి మంగళవారం ఒక వార్డు చొప్పున పర్యటిస్తూ పట్టణంలోని ప్రతి సమస్యను పరిష్కరించే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా అభివృద్ధిని కార్యరూపంలో చూపిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, యూనిట్ ఇన్‌చార్జ్ పరిశా రమేష్ గౌడ్, వార్డ్ ప్రెసిడెంట్ అద్దంకి సోమశేఖర్, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

