ఏలూరు, మార్చి 7: కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధరలను సాకుగా చూపుతూ దేశీయంగా ధరలను ఇష్టారాజ్యంగా తగ్గిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ విమర్శించారు. కోకో గింజలకు స్పష్టమైన ధరల పాలసీ, ఫార్ములా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం ఏలూరు పవర్‌పేటలోని అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కోకో రైతుల సమస్యలపై పలు తీర్మానాలు ఆమోదించారు.
ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో కోకో గింజల ధర రూ.900లకు పైగా ఉండగా రైతులకు కేవలం రూ.450 మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ ధరలు తగ్గాయని చెబుతూ కంపెనీలు కిలో ధరను రూ.400 నుంచి రూ.300–350కు తగ్గించడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల పాలసీ ప్రకటించకపోవడం వల్ల కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
మోండలీజ్ కంపెనీ కొద్దిమంది రైతుల వద్ద మాత్రమే గింజలు కొనుగోలు చేస్తోందని, దాదాపు 80 శాతం మంది రైతుల వద్ద గింజలు కొనుగోలు చేయకపోవడంతో వేల టన్నుల కోకో గింజలు రైతుల వద్ద నిల్వ ఉండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. కిలో కోకో గింజలకు కనీసం రూ.500 ధర కల్పించాలని, విదేశీ కోకో గింజల దిగుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ళ వెంకటసుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, ఉప్పల కాశీ మాట్లాడుతూ కోకో గింజల ధరలు తగ్గించిన కంపెనీలు చాక్లెట్ ధరలను మాత్రం తగ్గించలేదని విమర్శించారు. కంపెనీలు లాభాలు దండుకుంటూ రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఆయిల్ పామ్ గెలల ధరల మాదిరిగా కోకో గింజలకు కూడా ఫార్ములా రూపొందించి ధర నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కోకో రైతులు సంఘటితంగా ఉద్యమానికి సిద్ధమవుతారని నాయకులు హెచ్చరించారు.
ఈ సమావేశంలో రుద్రరాజు సుబ్బరాజు, కొండపల్లి సత్యనారాయణ, ఆర్. సుబ్బారావు, కె. సతీష్ బాబు, ఆలపాటి శ్రీనివాసరావు, ఎం.వి. రత్నాజీ, పి. పెదవీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన కోకో రైతులు సమావేశానికి హాజరయ్యారు.



.jpeg)