Ticker

6/recent/ticker-posts

కైకలూరులో వరుస హత్యలు–దొంగతనాలు కేసు ఛేదన: నిందితుడు అరెస్ట్


ఏలూరు, జూన్ 17: కైకలూరు పట్టణ ప్రాంతంలో ఒంటరి వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యలు మరియు దోపిడీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో కైకలూరు టౌన్, రూరల్ పోలీసు బృందాలు, సాంకేతిక ఆధారాలు మరియు స్థానిక సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.


దర్యాప్తులో భాగంగా కైకలూరు ప్రాంతంలో రెండు వేర్వేరు ఘటనల్లో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను హత్య చేసి, వారి వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. డయల్ 112 ద్వారా వచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, FSL బృందాల సహకారంతో ఆధారాలు సేకరించారు.

ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా కైకలూరు టౌన్‌కు చెందిన తుపాకుల ధృవంత్ (24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతను ఆర్థిక సమస్యలు, మద్యానికి బానిస కావడం, కుటుంబ విభేదాల కారణంగా నేరాలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన బంగారు, వెండి వస్తువులు, నగదు, అలాగే నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అదే ప్రాంతంలో జరిగిన మరో అనుమానాస్పద మరణ ఘటన కూడా ఇదే తరహాలో ఉండటంతో అదనపు ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. రెండు కేసుల్లోనూ ఒకే నిందితుడి ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

ఈ కేసును త్వరితగతిన ఛేదించిన కైకలూరు టౌన్, రూరల్ పోలీసు సిబ్బందిని ఏలూరు ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ అభినందించి రివార్డులు అందజేశారు.