లింగపాలెం: మండలం వేములపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న సిబ్బందితో కలిసి గ్రామంలో రాత్రి బస చేసి ప్రజలతో మమేకమయ్యారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో మాట్లాడిన పోలీసులు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రాణరక్షణకు ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. బాల్యవివాహాల నివారణ, పిల్లల హక్కుల పరిరక్షణపై కూడా వివరించారు.
గ్రామాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రోన్ పర్యవేక్షణతో కూడా నిఘా పెంచుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు చురుకుగా పాల్గొని పోలీసులను ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచి పోలీసులపై నమ్మకాన్ని బలపరుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

