WORLD NEWS: ఇరాన్ యుద్ధం మొదలవ్వగానే.. హిందూమహాసముద్రంలోని ఆ దేశ నౌకలను సైతం అమెరికా టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో శ్రీలంక తీరంలో ఉన్న ఓ ఇరాన్ నౌకను అమెరికా ధ్వంసం చేయగా.. భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. క్షతగాత్రులకు శ్రీలంక సర్కారు ఆశ్రయం కల్పించింది.
అయితే.. అదే సమయంలో భారత్‌లోని కొచ్చి తీరంలో కూడా ఓ ఇరాన్ నౌక ఉందనే విషయం ఎంతమందికి తెలుసు?? అప్పటికే కొచ్చి తీరంలో ఇరాన్‌కు చెందిన ఐరిస్ లావన్ అనే ఇరాన్ నేవీకి చెందిన ఓ యుద్ధ నౌక లంగర్ వేసింది. అమెరికా కూల్చేసిన ఐరిస్ దేనా అనే నౌకతోపాటు.. ఐరిస్ లావన్ గత నెల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్నాయి.
కొచ్చి తీరానికి ఐరిస్ లావన్
అవి తిరిగి వచ్చే క్రమంలో ఐరిస్ దేనాను అమెరికా ధ్వంసం చేయగా.. ఐరిస్ లావన్ మాత్రం కొచ్చి తీరానికి చేరుకుంది. ఈ నెల 13న ఆ నౌకలోని సిబ్బంది భారత్‌ను శరణు కోరారు. స్వతహాగా శరణన్న వారికి ఆశ్రయం కల్పించే నైజమున్న భారత్ అందుకు ఓకే చెప్పింది. అంతేకాదు.. ఐరిస్ లావన్ నౌకలోని నావికులను ఇరాన్‌కు పంపే ఏర్పాట్లు చేసింది. అప్పట్లోనే ఈ నౌకకు భారత్ ఆశ్రయం కల్పించిందని తెలుసుకున్న అమెరికా నేవి, బ్రిటన్ రాయల్ నేవీ.. ఆ నౌక జోలికి వెళ్లకపోవడం గమనార్హం..! అదే సమయంలో తన నావికులకు ఆశ్రయం కల్పించినందుకు ఇరాన్ రాయబారి భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
నౌకకు భారత్ భద్రత
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఐరిస్ లావన్ యుద్ధ నౌకలో ఏకంగా 140 మంది నౌకాదళ అధికారులు, సిబ్బంది, సహాయకులు ఉన్నారు. వారందరినీ ఇరాన్ యుద్ధ విమానాల్లో వారి దేశానికి సురక్షితంగా తరలించారు. పరిస్థితులు సద్దుమణిగేవరకు కొచ్చి తీరంలో ఉన్న యుద్ధ నౌకకు భద్రత కల్పించాలని ఇరాన్ కోరగా.. తమ వంతు ప్రయత్నం చేస్తామని భారత్ సమాధానమిచ్చింది. లంగరు వేసిన ఐరిస్ లావన్‌ను చిత్రీకరించిన ఓ జర్నలిస్టును కూడా పోలీసులు అరెస్టు చేశారు.
దీన్ని బట్టి ఆ నౌకకు భారత్ ఎంతలా భద్రత కల్పిస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్‌కు ఇది ఓ పెద్ద సాయం. నౌకాదళాన్ని కాపాడుకోవడానికి భారత్ భారీ సహకారం అందించినట్లు ఇరాన్ భావించింది. అంతే.. భారత్ కూడా తన అవసరాల కోసం ఇరాన్ ముందు డిమాండ్లు పెట్టింది. శాంతియుతంగా ఉండే తమ దేశానికి వస్తున్న నౌకలను హార్మూజ్‌లో అనుమతించాలని కోరింది. దాంతో.. ఇరాన్ వెంటనే ఓ ప్రకటన చేసింది. భారత్‌తో పాటు.. ఈ యుద్ధంలో పాల్గొనని దేశాల నౌకలకు హార్మూజ్‌లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే.. ఇప్పటికి మాత్రం భారత్ నౌకలు మాత్రమే హార్మూజ్ మీదుగా ప్రయాణిస్తున్నాయి.
.jpg)
