నూజివీడు: ప్రాంతంలోని ఆర్.ఆర్.పేటలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎస్. సవిత మరియు కొలుసు పార్థసారధి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలకు సమగ్ర అభివృద్ధి కల్పించేందుకు బిసి రక్షణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీలకు మరింత అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వడ్డే ఓబన్న బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటం గొప్పదని, ఆయన త్యాగాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గౌరవిస్తున్నదని చెప్పారు.
మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, సామాజిక భద్రత వంటి అంశాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
.jpeg)
