ఏలూరు: ఈ వేసవికాలంలో ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది కలగకుండా సరఫరా చేయడానికి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ మరియు పాలకవర్గం తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.
గోదావరి కాలువలో నీటిమట్టం రెండున్నర మీటర్లకు తగ్గిపోవడంతో 150 హెచ్‌పి మోటర్లు పనిచేయకపోవడంతో ప్రత్యామ్నాయంగా 15 హెచ్‌పి మోటర్లను ఏర్పాటు చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నింపే పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో 315 కేవిఎ ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్ అకస్మాత్తుగా మరమ్మత్తుకు గురైంది. వెంటనే మున్సిపల్ ఎలక్ట్రికల్ అధికారులు రంగంలోకి దిగి అక్కడే ఉన్న 650 కేవిఎ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అందించి మోటార్లను నడిపించారు.
ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నూర్జహాన్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు శనివారం మరమ్మత్తుకు గురైన ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించారు. వెంటనే 315 కేవిఎ ట్రాన్స్‌ఫార్మర్‌ను రిపేర్‌కు పంపించి, దాని స్థానంలో స్టాండ్‌బైగా ఉన్న 230 కేవిఎ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి మోటార్లను నడపాలని అధికారులకు సూచించారు.
ఇప్పటికే ఎస్‌ఎస్ ట్యాంక్ బండ్ వద్ద శాశ్వత లీకేజీ పనులు కొనసాగుతుండగా, కొన్ని రోజుల పాటు కాలువ పూర్తిగా ఆగిపోవడం, అనంతరం గోదావరి కాలువలో నీటిమట్టం తగ్గిపోవడం వల్ల పెద్ద మోటర్లు పనిచేయని పరిస్థితి ఏర్పడింది. దీంతో చిన్న మోటర్ల ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లోకి గోదావరి నీటిని తోడే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇలాంటి అనేక సాంకేతిక సమస్యలు ఎదురైనా ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి సరఫరా నిలిచిపోకుండా నగరపాలక సంస్థ పాలకవర్గం కృషి చేస్తోందని కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు తెలిపారు. ఈ వేసవికాలంలో నగర ప్రజలకు రెండు పూటలా త్రాగునీటిని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.



.jpeg)