Ticker

6/recent/ticker-posts

యాదవ్ నగర్‌లో రూ.60 లక్షలతో సీసీ రోడ్ల పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు, మార్చి 7: ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తెలిపారు.


ఏలూరు నియోజకవర్గంలో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ప్రాధాన్యతా క్రమంలో ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ వేగవంతం చేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో స్థానిక 49వ డివిజన్ యాదవ్ నగర్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో రూ.60 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మూడు సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే బడేటి చంటి శనివారం పరిశీలించారు.

రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒక రోడ్డు నిర్మాణానికి సంబంధించి స్థానికులతో కొబ్బరికాయలు కొట్టించి శంకుస్థాపన కూడా చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తరువాత రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. శిలాఫలకాల ఆవిష్కరణలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తాము చేసిన అభివృద్ధే ప్రజలతో మాట్లాడుతుందని అన్నారు.

రానున్న రోజుల్లో నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అలాగే వివిధ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వాటిని వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్లనీయకుండా వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. అలాగే నగరవాసులు కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన పన్నుల బకాయిలను త్వరగా చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ విజయవాడ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు, కార్పొరేటర్ దేవరకొండ శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్‌ఎంఆర్ పెదబాబు, బీఎస్‌ఎన్‌ఎల్ అడ్వైజరీ బోర్డు కమిటీ సభ్యుడు లంకపల్లి మాణిక్యాలరావు, డివిజన్ కో-క్లస్టర్ ఇన్‌చార్జ్ ఆర్నేపల్లి తిరుపతి, డివిజన్ ఇన్‌చార్జ్ నేరుసు గంగరాజు, డివిజన్ కో-ఇన్‌చార్జ్ అన్నవరపు సతీష్, డివిజన్ అధ్యక్షురాలు వేముల రంగమ్మ, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు యలమల వెంకటేశ్వరరావు, నల్లగొండ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.